సమరసతే భారతీయత
_ఆకెళ్ళ శివప్రసాద్ సాహితీ విధా సంస్కార భారతి తెలంగాణ ప్రాంతం
ఆపాత మధురమైన సంగీతాన్ని విన్నా..
ఆలోచనామృతవైన సాహిత్యాన్ని చదివినా.. ఎంత బాగుందో అనుకుంటామే కానీ.. ఆ గాయకుడు ,సంగీత విద్వాంసుడు రచయిత, కవి వీళ్ళందరూ ఏ కులానికి చెందినవారు, ఏ మతానికి చెందినవారు అనే ప్రశ్నా రాదు.. ఆలోచన రాదు..
కేవలం ఆ సాహిత్యం రేకెత్తించిన ఆలోచనలని, సంగీతం అందించిన మాధుర్యాన్నిఅనుభవించి…ఆ కళాకారులు ఎవరైనా సరే , అద్భుతంగా ఉంది అని మనస్ఫూర్తిగా , ఆనందంతో స్పందిస్తాం..వారిని మెచ్చుకుంటాం…సౌమ్యంగా అభినందనలు తెలుపుతాం..
.. ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా వివిధ భాషలని..వివిధభౌగోళిక పరిస్థితులని.. వివిధ సాంస్కృతిక నేపథ్యాలని.. అపురూపమైన ముత్యాలహారంగా పెనవేసి, భిన్నత్వంలో ఏకత్వంగా కనిపిస్తున్న అఖండ భారతీయతే ..భారతీయుల ఆత్మకి మూల మైన సమరసత.
సనాత ధర్మాన్ని మన సాంస్కృతిక రూపాలలో ,సామాజిక జీవనంలో అంతర్భాగంచేసుకున్నాం.
అయితే కాలక్రమేణా ,విదేశీయుల ఆక్రమణ వల్ల ,విదేశీ భావజాలం విస్తృతంగా స్వైర విహారం చేయడం వల్ల ,కుహనా మేధావులు సంఖ్య అసంఖ్యాకంగా పెరిగిపోవడంతో , అసలైన చరిత్రనివక్రీకరించిన వాళ్ళు శతాబ్దాలుగా, స్వాతంత్రం వచ్చాకా,దశాబ్దాలుగా ఆలోచనని ప్రభావితం చేసే తప్పుడు సమాచారన్నే పదేపదే పలు మార్గాలలో సరఫరా చేయడం వల్లా, ఆ సమాచారమే సరైనదని దేశాన్ని పాలించిన వారు, వారిని ఆశ్రయించిన కుహానా మేధావులు పదే పదే వల్లే వేయడం వల్ల , సంగీత సాహిత్యాలతో పాటు అన్ని రకాల కళా రూపాలలో, మాధ్యమాలలో అవి చొచ్చుకొని చాలాకాలంగా స్థిరపడిపోవడం వల్ల, మనలో మనకి విభేదాలు కలిగిస్తూ, అనేకసార్లు ఘర్షణలకి దారితీసి,మనకీ మనమే శత్రువులుగా మారి ద్వేష భావాల తో రగిలి పోయే పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడుతున్నాయి.
ముఖ్యంగా కులం అనే మాట మీద పార్టీలు పుట్టి అధికారంలో నిలబడ్డానికి చేస్తున్న పలు కసరత్తులు విస్తృతమైపోతున్న ఈ సందర్భంలో.. మన భారతీయ సంస్కృతిలో భాగంగా ఉన్న సమరసత విశేషాలని ఒక్కసారి గుర్తుతెచ్చుకుందాం.
ఏకాత్మ భావన కలిగి ఉండడం అనేది సమరసత కి మూలం.
ఎందరో మహనీయుల జీవితాలలో జరిగిన సంఘటనలు, మనకు దిక్సూచిలుగా మారతాయి.
ఒకనాడు కాశీమహా క్షేత్రంలో జగద్గురు శంకరాచార్య భాగీరధి నది తీరంలో నడుచుకుంటూ వెళ్తుంటే ,దారికి అడ్డంగా ఒక చండాలుడు వచ్చాడు . జగద్గురువుల శిష్యులు” చండాల.
దారికడ్డులే .. వెళ్ళు ‘అన్నారు.చండాలుడు చిరుదరహాసంతో “ఎవరు అడ్డు తొలగాలి.
ఈ శరీరమా …ఇందులోని ఆత్మా ?’అని ఎదురు ప్రశ్నించాడు.
అద్వైతాన్ని అందించిన శంకరులు ఆ ప్రశ్నలోని ఆంతర్యాన్ని గ్రహించి ఆ చండాలుడికి సాష్టాంగ వందనం చేశారు. ఏకాత్మ భావని అద్వితీయంగా ప్రపంచానికి సందేశ రూపంలో అందించడానికి,సాక్షాత్తు జగద్గురు శంకరాచార్య వారు చండాలుడి ప్రశ్నకి ప్రతిస్పందించిన తీరే ఒక గొప్ప ఉదాహరణ. అపురూపమైన సార్వ కాలీన సత్యాన్ని ప్రపంచానికి అందించారు. అదేవిధంగా ,రామానుజచార్యులు వారు తమ గురువు అందించిన అష్టాక్షరి నారాయణ మహా మంత్రాన్ని గుడి గోపురం మీదకి ఎక్కి, తను నరకంలోకి వెళ్లినా పర్వాలేదని తన గురువుకి చెప్పి,అక్కడకి వచ్చిన వారందరికీ వినబడేలా అందించారు.ఆనాటి దురాచారం లో భాగంగా ఉన్న, అంటరాని వారుగా భావించిన వారికి ఆలయ ప్రవేశం కల్పించడమే కాకుండా , ఆనాటి కాలంలో అంటరాని వారుగా భావించిన వారిని తన శిష్యులుగా చేసి వారికి జ్ఞాన బోధ చేశారు. వారిని ఏ సంకుచిత ధోరణికి ఆస్కారం ఇవ్వకుండా ఏకాత్మ భావనతో చూశారు.
అట్లాగే తరతరాలుగా భారతీయ లందరికీ ముఖ్యంగా యువతరానికి స్ఫూర్తివంత మైన వ్యక్తిగా కనిపిస్తున్న, అపురూపమైన శక్తి స్వామి వివేకానంద గురువైన రామకృష్ణ పరమహంస భగత్ ఆరాధనకి భగవత్సాక్షాత్కారానికి కులం, మతం,సాంప్రదాయం ,స్త్రీ పురుష లింగ భేదాలు లేవని బోధించారు.
మన ముందు తరంలో , మౌనమే మన ఎరుకకి మూలమని తెలియజేసిన శ్రీ రమణ మహర్షి ఏ భేదభావములేకుండా అందరితో సహపంక్తి భోజనం చేసేవారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. చరిత్రను నడిపించిన మహనీయులు, చరిత్రని సృష్టించిన మహానుభావులు ఎప్పుడూ సమరసతనే కోరుకున్నారు.
ఆ సమరత బీజాలే మన భారతీయతకి మూలం. కేవలం బోధించడం కాకుండా ఆచరణ పెట్టినవారు ఈమహనీయులందరు. ఇటువంటి మహనీయులు దేశంలోని ప్రతి మూలా ప్రతి చోటా ఉన్నారు ఎంద రెందరో చరిత్ర పుటలలో కనిపిస్తారు.
భారతీయత సంస్కృతీ మహావృక్షంగా పలు శాఖలుగా విస్తరించింది. ఒక వృక్ష శాఖలో.. ఇక్కడి ప్రాంతంలో కూచిపూడి రూపంలోనో, భరతనాట్యం రూపంలోనో, రామాయణ ఘట్టాన్ని ప్రదర్శిస్తే మరో ప్రాంతంలో కథాకళి ప్రక్రియలోనో, కథక్ లోనోఅదే రామాయణ ఘట్టాన్ని అంతే ఆసక్తిగా ఆకర్షణీయంగా ప్రదర్శిస్తారు. రామాయణం ఒకటే కానీ బహురూపాలుగా ప్రదర్శనకు నోచుకుంది. కేవలం ఆహార్యంలోనూ సంగీతంలోనూ విభిన్నతే కానీ రామాయణ గాధలోను , గాధలో అంతర్ సూత్రంగా గల ధర్మంలోనూ, వీటికి ఆధార భూతమైన ఆత్మలోనూ అంతరం లేదు . అలాగే భారతం కథలైనా,భాగవతం కథలైనా ఇతర పురాణ గాథలైన అన్నిట్లోనూ మూలాన్ని పలువురు పలు రకాలుగా అర్థం చేసుకుని పలు విధాలుగా ప్రపంచానికి అందించే ప్రయత్నం చేశారు.రూపంలోనే వైవిధ్యం ఉంటుంది .రూపాల్లో వ్యత్యాసా లున్నాయని మూలాధారమైన ఏకాత్మ భావనలో వ్యత్యాసాలు ఉన్నాయని భావించకూడదు. హిందుస్తానీ రాగంలో అలరించే మీరాబాయి కీర్తనలు, కర్ణాటక సంగీతంలో రూపుదిద్దుకున్నఅచ్చ తెలుగు త్యాగరాజ కీర్తనలు అన్నమాచార్య కీర్తనలు …తరతమ బేధాలు లేకుండా భారతీయులందరినీ అలరిస్తాయి ఆనంద డోలికల్లో తేలిఆడిస్తాయి.ఈ సంగీతానికి,సాహిత్యానికి వీటికి మూలమైన సంస్కృతికి భాష భేదాలు లేవు.ఇక్కడ మరొక విషయమేమిటంటే అగ్రకుల ఆధిపత్యమే చెలాయింపులో ఉందనిమూసధోరణిలోమాట్లాడేవారు గ్రహించవలసిన విషయం ఏమిటంటే సంస్కృతి సాంప్రదాయంలో అన్ని వర్గాల వారుభాగస్వాములే. భగవద్గీతలో చెప్పినట్టు కేవలం ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి మానవులు నాలుగువర్ణాలు గావిభజించబడ్డారు .తర్వాత కొన్ని సామాజిక కారణాలవల్ల వాటిని కులాలుగా విభజించారు . ఇక్కడే మరొక ఉదాహరణ.
మనందరం పరమపవిత్రంగా కొలిచే తిరుమల దేవాలయంలో ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారాలు తీశాక, గొల్లవారే దివిటీని పట్టుకుని ఆ వెలుగులో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే గొల్లవాడు చూసిన తర్వాతే మిగతారందరికీ దర్శనం చేసుకునే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది . అలాగే పలు శాఖలలో పలు సంస్థలలో విభేదాలు లేకుండా అందరూ కలిసి దేశ ఉన్నతికి అనునిత్యం కృషి చేస్తూనే ఉన్నారు.
ఒక్కొక్క వృత్తి ఆధారంగా ఏర్పడిన కులాలను మనుషుల మధ్య అంతరాలు సృష్టించడానికి ఉపయోగించడ మంటే, మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకున్నట్టు. ఇక్కడ మరొక ఉదాహరణ.
ఈ మధ్యకాలంలో అయోధ్య మందిర నిర్మాణానికి ఏ పారిశ్రామికవేత్త కోఅవకాశం ఇస్తే సులభంగా దాని నిర్మా ణానికి అవసరమైన ధనాన్ని సమకూర్చేవారు. కానీ అన్ని రకాల వర్గాలకు ఎవరి స్థాయికి తగ్గట్టు వారిని సంస్కృతికి ప్రతిరూపమైన అయోధ్య ఆలయ నిర్మాణం లో,
భాగస్వామ్యులను చేయడం కూడా ఈ సమరసతకి నిదర్శనమే .
ఇక చివరికి , ఈమధ్య ఒక మిలటరీలో పని చేసిన మిత్రుని కలిసినప్పుడు ‘సరిహద్దులో కాపలా కాస్తున్న మాకు, ఫలానా కులమని కానీ ఫలానా మతమని,
ఫలానా ప్రాంతమని అని ఏ రోజు ఆలోచన రాలేదు ..మనమంతా భారతీయులం .. మనం మన దేశం అనే ఆలోచనతోనే అనుక్షణం అహర్నిశలు అతి క్లిష్టమైన ప్రాంతాలలో కూడా కాపలా కాస్తం “అన్నారు. సరిహద్దు కాపలా విషయంలో సమరసతే ఆయుధం. మనో ఉల్లాసాన్ని కలిగించే కళా రూపాల్లో అయినా, దేశ రక్షణకు పాటుపడే సైన్యం లోనైనా సమరసతే మూలాధారం.
అలాంటప్పుడు కేవలం చిన్నచిన్న విభేదాలు వచ్చిన సందర్భాలలో సౌజన్యంతో ,స్నేహభావంతో పరిష్కరించుకోవాలి.
అంతేకానీ, వాటికి రాజకీయ రంగులు పులిమి వ్యవస్థ మొత్తాన్ని అస్తవ్యస్తం చేయడం సరికాదు . ఒక రథయాత్రలో రథం కదలా లంటే, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ చొరవ తీసుకుని , శ్రమించి ముందుకు లాగాలి. అదేవిధంగా దేవుడి కార్యమైన దేశ కార్యమైన అందరూ సమరసతో ముందుకు సాగినప్పుడే భావితరాలకి బంగారు భవిష్యత్తును అందిస్తాం .దేశాన్ని ఉన్నత శిఖరాలు తీసుకెళ్ల గలుగుతాం.
జైహింద్
